నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరోనా కారణంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిరాడంబరంగానే జరిగాయి.ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, నమస్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
మరోవైపు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్లా జిల్లాలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, మహబూబునగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మెదక్ జిల్లాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి జిల్లాలో హోంమంత్రి మహమూద్ అలీ, మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు.