ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ తుదిశ్వాస విడిచారు. కాగా, గద్దర్ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే, గద్దర్ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు. మాభూమి’ సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్ ఆయనకు ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా..’ పాటకు నంది అవార్డు లభించింది. అయితే, ఆ అవార్డును తిరస్కరించారు. ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట పెద్దఎత్తున ప్రజాదరణ పొందింది.













