తెలంగాణలో మరో 10 రోజుల పాటు… లాక్‍డౌన్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‍డౌన్‍ను రాష్ట్ర ప్రభుత్వం మరో పది రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు సాయంత్రం ఆరు గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మరో పది రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మర్నాడు ఉదయం 6 గంటల వరకు లాక్‍డౌన్ అములులో ఉంటుంది. ఆ సమయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రివర్గం పోలీస్‍శాఖను ఆదేశించింది.
మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైరస్ విస్తరణ ఇంకా అందుపులోకి రాలేదు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతమున్న విధంగానే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఉదయం ఆరు గంటలవరకు లాక్‍డౌన్ కొనసాగుతుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజవకర్గాల పరిధిలో యథాతథ స్థితిని కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో లాక్‍డౌన్‍ను ఇప్పుడున్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలిస్తారు.