గవర్నర్‌తో సయోథ్య కే కెసియార్ మొగ్గు…
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఎవరితోనైనా స్పర్ధలొస్తే అంత తేలికగా వెనుకడుగు వేసే రకం కాదని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతుంటారు. కాకలు తీరిన రాజకీయ యోధులతో తలపడిన చరిత్ర, తను తీసుకునే నిర్ణయాలపై ప్రజల్ని ఒప్పించే శక్తి యుక్తులు మెండుగా ఉన్న నేత ఆయన. అందుకే ఎవరితోనైనా సై అంటే సై అంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన దూకుడు తగ్గినట్టే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
దీనికి తెలంగాణ గవర్నర్ తమిళసై తో ఆయన వ్యవహరిస్తున్న తీరు అందుకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. కేంద్రప్రభుత్వం నియమించిన తెలంగాణ గవర్నర్ పూర్వాశ్రమంలో నిబద్ధత కలిగిన భాజాపా నేత అనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసి కలకలం రేపారు. ముఖ్యంగా కరోనా పరిస్థితుల నివారణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందంటూ ఎత్తి చూపారు. అంతేకాకుండా దీనిపై తాను చేసిన కొన్ని ముందస్తు సూచనలను కూడా కెసియార్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
దీనిపై కెసియార్ వెంటనే స్పందిస్తారని, ఘాటుగా ప్రత్యుత్తరం ఇస్తారని పలువురు భావించారు. అయితే ఆయన పెద్దగా ప్రతిస్పందించలేదు. ఆయన ప్రభుత్వంలోని ఒకరిద్దరు నేతలు తప్ప మరెవరూ గవర్నర్ విమర్శలపై ఎదురుదాడి చేయలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆయన విభేధించినప్పటికీ… గవర్నర్‌పై విమర్శలు చేయలేదు. వ్యవసాయ బిల్లుల వంటి అంశాలపై కుండబద్ధలు కొట్టినట్టు వ్యవహరిస్తూనే.. కేంద్ర ప్రభుత్వంతో పట్టు విడుపుల ధోరణితో ఉండాలని ఆయన భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గవర్నర్ భర్తకు కెసియార్ సన్మానం..
తాజాగా కెసియార్ శుక్రవారం గవర్నర్ తమిళసై ని కలిశారు. ఆమె భర్త, ప్రముఖ వైద్యులు నెఫ్రాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్న డా.సౌందర్ రాజన్‌కు ధన్వంతరి అవార్డు రావడంపై అభినందించారు. అంతేకాకుండా ఆయనకు సన్మానం కూడా చేశారు. మరోవైపు గవర్నర్ తమిళ్సై తెలంగాణ ప్రభుత్వం కరోనాపై పటిష్ట చర్యలు చేపట్టిందంటూ అభినందించారు. తెలంగాణలో కరోనా వ్యాధి బాధితుల రికవరీ రేటు చాలా మెరుగ్గా ఉందన్నారు.













