తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం
బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రంలోని 31 జిల్లాలు, 164 పారిశ్రామిక వాడలు, 91 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించేందుకు తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్)ను ప్రభుత్వం ప్రకటించింది. వివరాలను రోడ్లు రహదారుల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల్లో అభివృద్ధి సాధించేందుకు అసోసియేట్స్ కనె్సల్టింగ్ సంస్ధ ద్వారా అధ్యయనం చేయించారు. ఈ విజన్ డాక్యుమెంట్లో తెలంగాణలోని పట్టణాలకు మాత్రమే కాకుండా ఐదు పొరుగు రాష్ట్రాలకు చక్కటి అనుసంధానం ఏర్పడనుంది. సామాజిక అభివృద్ధి, బంగారు తెలంగాణ ఆవిష్కరణకు మార్గదర్శకంగా బంగారు వలయం ఉండబోతున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇందులో భాగంగా 31 జిల్లాలను కలిపే బృహత్తర కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీనికి ట్రాక్ అని నామకరణం చేశారు. రహదారుల అభివృద్ధి కార్యక్రమం అమలుకు రాష్ట్ర రహదారి నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న బాహ్య వలయ రహదారి, పరిసర జిల్లాలను కలిపే ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారికి అదనంగా తెలంగాణ బంగారు వలయం, బంగారు మాల, ఉత్తర దక్షిణ తెలంగాణ మార్గం, తూర్పు పశ్చిమ మార్గం, రేడియల్స్ రోడ్లు అని ఏడు విభాగాలుగా విభజించారు. ఈ పథకంలో సుమారు 5107 కి.మీ వలయ, రేడియల్ రహదారులను ప్రతిపాదించారు. ఇందులో జాతీయ రహదారుల నిడివి 905 కి.మీ ఉన్నట్లు ట్రాక్‌లో పేర్కొన్నారు. 3963 కి.మీ రోడ్లను నిర్మించడం ద్వారా 31 జిల్లాలను అనుసంధానం చేస్తారు. బంగారు మాల నిడివి 1534 కి.మీ, ఉత్తర, దక్షిణ రహదారి 558 కి.మీ, తూర్పు, పశ్చిమ రహదారి 511 కి.మీ, బంగారు వలయం 886 కి.మీ, ప్రగతి పథాలు 1618 కి.మీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 5107 కి.మీ రోడ్లను నిర్మించాల్సి ఉంది. రాష్ట్రంలో రహదారుల నిడివి 25,792 కి.మీ అని, తమ శాఖకు ఇతర శాఖల నుండి బదిలీ అయిన తర్వాత ప్రతిపాదిత దారుల నిడివి 42,053 కి.మీ ఉండాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ కార్యక్రమం అమలుకు తుది రూపు ఇవ్వనున్నారు. నిధులను సమకూర్చేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసినట్లు చెప్పారు.













