హైకోర్టు తీర్పు అమలు చేయండి : కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు శాసన సభాపతి మధుసూదనాచారిని కలిశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, కోర్టు తీర్పును గౌరవించి వారి సభ్యత్వాలు పునరుద్ధరించాలని స్పీకర్ను కోరారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చి 50 రోజులు పూర్తయినప్పటికీ దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అసెంబ్లీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని తాము భావించినప్పటికీ నిరాశే ఎదురైందన్నారు. ఈ అంశంలో హైకోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని అన్నారు.













