2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన కాంగ్రెస్
ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ మేరకు జీవన్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్లు ప్రకటించింది. సమావేశం అనంతరం ఆ వివరాలను టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. హౌసింగ్ స్కీం పైనే ప్రధాన చర్చ జరిగింది. ఇళ్లులేని వారికి కుటుంబానికి 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు లక్ష అదనంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి రూ.2 లక్షలు ఇవ్వాలని తీర్మానించింది. తెల్లరేషన్ కార్డుదారులకు కూడా కాంగ్రెస్ వరాలు ప్రకటించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ 7 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణ లక్ష్మితో పాటు బంగారు లక్ష్మి పథకాన్ని కొనసాగించనున్నారు. వికలాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. వికలాంగుల శాఖ విలీనం రద్దు చేయనున్నారు. ఇంటి విద్యుత్ 200 యూనిట్లు వరకు ఉచితంగా ఇవ్వాలని మేనిఫెస్టో కమిటి నిర్ణయించింది.













