ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్
తెలంగాణాలో ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గాంధీభవన్లో ఆ పార్టీ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సభాపతి, ఉప సభాపతి ఎన్నిక సమయంలో వారి కోరిక మేరకు టీఆర్ఎస్కు తాము మద్దతిచ్చామని ఉత్తమ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రాగానే వికృత రాజకీయాలకు దిగజారారని టీఆర్ఎస్నుద్దేశించి విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని, టీడీపీ, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. పెద్దల సభ ఎన్నికల వ్యవహారం అంటే హుందాగా ఉండాలని, గ్రామస్థాయి ఎన్నికలకంటే పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.













