ఆయన మరణం ప్రజలకు తీరని నష్టం : సీఎం రేవంత్ రెడ్డి

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని, వ్యవస్థ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం ప్రజలకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో రామోజీరావు తాను స్థాపించిన ఈనాడు, ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారని అన్నారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రామోజీరావు చూపిన మార్గంలో ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతుంది. రామోజీ లాంటి మరో వ్యక్తి రారు. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన చూపిన మార్గంలో వారి సంస్థలు, ప్రజల తరపున నిలబడతాయని ఆకాంక్షిస్తున్నా. వారి కుటుంబానికి, సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా అని సీఎం భరోసా ఇచ్చారు.