అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది. విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. న్యూయార్క్, డల్లాస్, శాన్‌ప్రాన్సిస్‌కో, న్యూజెర్సీ ప్రాంతాల్లో ప్రముఖ వ్యాపార వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. లైఫ్ సైన్స్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలు, టెక్నాలజీ రంగంలో ఉండే వ్యాపారుల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.