రేపే తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం… భారీగా ఏర్పాట్లు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సన్నద్ధమవుతోంది. ఆదివారం ( ఈ నెల 29న) జరిగే ఈ వేడుకకు ఏర్పాట్లు భారీగా కొనసాగుతున్నాయి. సచివాలయం తూర్పుభాగంలో సుదర్శన యాగం నిర్వహణకు హోమగుండం నిర్మించారు. ప్రధాన ద్వారం నుంచి వచ్చే వాహనాల నంబర్లను గుర్తించి తెరుచుకునే విధంగా నెలకొల్పిన సెన్సర్ ఆధారిత బారియర్ల పనితీరును ఉన్నతాధికారులు పరిశీలించారు. ఉత్తరం మూలన నిర్మించిన భద్రతా టవర్‌పై సిబ్బంది నిరంతర నిఘా ఉంటుంది. ఉత్తరం వైపు సిబ్బంది పార్కింగ్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో చర్చి, పక్కనే మసీదు, నైరుతి మూలలో గుడిని నిర్మిస్తున్నారు. ప్రధాన ద్వారాన్ని సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం కేటాయించారు. బాంబ్ స్క్వాడ్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ అంజనీకుమార్, సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాంగణమంతా కలియతిరిగి క్షుణ్నంగా పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇందులో టీఎస్ ఎస్పీ అదనపు డీజీ స్వాతిలక్రా, శాంతిభద్రతల విభాగం ఏడీజీ సంజయ్‌జైన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.













