జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కే. చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీపై వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళుతున్నారు. ఈ మేరకు ఆయన జెండా ఏజెండా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ ఈ జాతీయ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా చక్రం త్రిప్పేందుకు కేసీఆర్ ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ, మోదీపై విమర్శల బాణాన్ని కేసీఆర్ ఎక్కుపెడుతున్నారు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఇతర పార్టీల నాయకులను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు తానే జాతీయ రాజకీయాల్లో పోటీపడేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే పావులు కదిపినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల నేతలతో విస్తృతంగా చర్చిస్తున్న కేసీఆర్.. ఈ మేరకు జాతీయ పార్టీతో ఆ ప్రాంతీయ పార్టీల పొత్తు పెట్టుకునేలా స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఇప్పటికిప్పుడు అది దేశవ్యాప్తంగా సత్తా చాటే అవకాశాలు లేవు. అందుకే ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగాలని యోచిస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఆయా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీలతో కూటమిని కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటే జాతీయ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఏర్పాటు చేయవచ్చు.
కానీ టీఆర్ఎస్ ను కాదని కొత్త పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ నడుం బిగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సఖ్యత ఉన్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా పోటీచేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని.. సీట్లు కేటాయించే అవకాశం లేదు. కర్ణాటకలో జేడీఎస్ అయినా.. బీహార్ లో ఆర్జేడీ జేడీయూ అయినా కూడా కేసీఆర్ ఉనికి లేని జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోరు. ఢల్లీిలో ప్రబలంగా ఉన్న కేజ్రీవాల్ సైతం అంతే.. అందుకే కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నా సరే.. ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు ఇచ్చే అవకాశం లేదు.
ఏ రాష్ట్రంలో అయినా ఇతర పార్టీలు బలపడడానికి అవి అంగీకరించవు. అందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా కూడా.. కేంద్రంలో అధికారం కోసం ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆసక్తిగా మారింది. బీజేపీని గద్దెదించేందుకు ఇవన్నీ ప్రత్యామ్నాయంకోసం చూస్తాయి. ఆ లక్ష్యంతోనే ఓ జాతీయ వేదికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అయితే జాతీయ పార్టీ.. లేదంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి జాతీయ పార్టీని నిలబెట్టడం.. ఈ రెండు వ్యూహాలతోనే కేసీఆర్ ముందుకు సాగుతున్నట్టు అర్థమవుతోంది. బీజేపీని ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీ అవసరం కాబట్టి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు సాగాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే ఇందులో భాగంగా జేడీఎస్, శివసేన, సమాజ్‌వాదీ, ఆప్ సహా అనేక ఇతర పార్టీల నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్.. తాజాగా ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో దోస్తీ చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కూడా చర్చలు జరిపారు. ఆర్జేడీ ముఖ్యనేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కూడా సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఇటీవల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘం నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్.. వాళ్లు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని పెద్దపల్లి బహిరంగ సభలో తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన జై తెలంగాణతో పాటు జై భారత్ నినాదాన్ని అందుకున్నారు. ఏ సభ జరిగినా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. జాతీయ సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తారని.. భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి రూపుదిద్దుకుంటోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనట్లు సమాచారం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీపై కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీ ఉన్నందున.. గుజరాత్,హిమాచల్, కర్నాటకలో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నారట.
ఆయా రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలను పోటీ చేయించి.. వారికి మద్దతుగా ప్రచారం చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలు ఉన్నాయి? బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలా ఉన్నాయి? కేంద్రంలో బీజేపీ వైఫల్యాను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా.. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారట. ఇటీవల 26 రాష్ట్రాలకు చెందిన రైతులు తెలంగాణలో పర్యటించారు. ప్రగతి భవన్లో రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్, మోటార్లకు మీటర్లను వ్యతిరేకించడం, సాగునీటి సౌకర్యం, గ్రామాల్లో కల్లాల నిర్మాణం, రైతు వేదికలు తదితరాల గురించి అధికారులు వారికి వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని.. దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుటుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.
దసరాకు…
ముఖ్యమంత్రి కేసీవర్ దసరాకు జాతీయ రాజకీయ పార్టీని తెర ముందుకు తీసుకురావాలని బలంగా భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కసరత్తు చేస్తున్న గులాబీ దళపతి త్వరలోనే విధి విధానాల వెల్లడికి సన్నద్ధమవుతున్నారు. భాజపా, కాంగ్రెస్ కు సమదూరం పాటించేలా.. దళితులు, రైతులు, కార్మికులు, యువత అంశాలనే ప్రధాన ఎజెండాగా తొలి అడుగులు వేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు కేసీఆర్ ఇప్పటికే పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి కుమారస్వామికి చర్చలు జరిపినప్పుడు త్వరలోనే జాతీయపార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి అవసరమని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అభిప్రాయపడినట్లు వార్త.













