తెలంగాణ ఓటర్లకు కీలక సూచనలు… ఇవే
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. అఫిడవిట్లో అన్ని కాలమ్స్‌ను అభ్యర్థులు కచ్చితంగా నింపాలి. లేదంటే తిరస్కరణకు గురవుతుంది. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. ఫిర్యాదుల కోసం 1950 ను సంప్రదించాలి. ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.
బ్యాలెట్ పత్రాలపై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు కూడా ఉంటాయి. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలి. అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా మార్పు దరఖాస్తులు ఇవాల్టి నుంచి వాయిదా వేస్తున్నాం. నగదు ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు ఉండాలి. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కసరత్తు జరుగుతోంది. నగదు లావాదేవీలు, మద్యం సరఫరాకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ ఉంటుంది అని వికాస్ రాజ్ తెలిపారు.













