సీఎం కేసీఆర్ స్పందించకపోతే.. ఉద్యమం తప్పదు
పాతబస్తీలోని ఆలయాల భూముల పరిరక్షణపై సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 24 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ చేసే ఉద్యమానికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోస్టింగులు, అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ పాతబస్తీలో కాళీమాత అమ్మవారి స్థలాన్ని కబ్జా చేసేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మూడుసార్లు కబ్జా చేసేందుకు యత్నిస్తే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. దేవాలయ భూమిని కాపాడేందుకు వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలు, మహిళలను పోలీసులు కొట్టారని రాజాసింగ్ ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.













