మిలియన్ మార్చ్ చేసిన చోటే.. మీ పార్టీని : కిషన్ రెడ్డి
తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆయన చేతగానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అప్పు చేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలు రాస్తే, ప్రశ్న పత్రాలు లీక్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజ్‌పై పోరాటం చేస్తే బండి సంజయ్‌పై కేసులు పెట్టారు. గత తొమ్మిదేళ్ల నుంచి డీఎస్సీ వేయలేదు. గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. నిరుద్యోగ భృతి ఏమైందో ఆయన చెప్పాలి. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేసింది. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారు. బంగారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చారు. ఖబడ్దార్ కేసీఆర్.. మిలియన్ మార్చ్ చేసిన చోటే మీ పార్టీని యువత పాతరేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేసి బలోపేతం చేస్తున్నారు అని ఆరోపించారు.













