ఉక్రెయిన్‌లో తెలంగాణ విద్యార్థుల అవస్థలు.. స్పందించిన బండి సంజయ్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయు విద్యార్థులు ఉక్రెయిన్‌లోని కీవ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 20 మంది భారతీయ విద్యార్థులు అవస్థలు పడుతున్నామంటూ వారి కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలుసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన సంజయ్ వారిని వెంటనే భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. వీరితో తెలంగాణకు చెందిన విద్యార్థులు కడారి సుమాంజలి (కరీంనగర్), రమ్యశ్రీ, ఎన్.శ్రీనిది, లిఖిత ఉన్నారు. వీరంతా ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విషయాన్ని కడారి సుమాంజలి తన సోదరుడు స్వామికి ఫోన్ చేసి చెప్పారు. తమను ఎటూ వెళ్లనీయడం లేదని, అవస్థలు పడుతున్నామని వాపోయినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను వెంటనే భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాల్సిందిగా బండి సంజయ్‌ని కడారి స్వామి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సంజయ్ ఉక్రెయిన్‌లోని చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ వారిని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతూ లేఖ రాశారు.













