అక్కడి పరిస్థితిని గవర్నర్ దృష్టికి : బండి సంజయ్
న్యాయబద్ధంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు అర్థరాత్రి దారుణంగా దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి గవర్నర్ తమిళిసైను కలిశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలను గవర్నర్కు తెలిపామని చెప్పారు. చట్టప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకపోవడంతో వారంతా కోర్టు ఆశ్రయించారన్నారు. అర్థరాత్రి పోలీసులు ప్రతి ఇంటిపైనా పడి మహిళలు, వృద్ధులు, చిన్నారులు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టారని ఆరోపించారు. మహిళలకు తీరని అవమానం జరిగిందన్నారు. అక్కడ పరిస్థితిని గవర్నర్కు వివరించామని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న ససమ్యలు, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.













