ఐటీ సేవల్లో తెలంగాణ మరో ఘనత …
తెలంగాణ మరో ఘనత సాధించింది. పట్టణాభివృద్ధిలో తీసుకొచ్చిన ఐటీ ఆధారిత సేవలతో రాష్ట్రానికి మరో అవార్డు వరించింది. జనాగ్రహ సిటీ గవర్నెన్స్ సంస్థ ఉత్తమ స్టేట్ క్యాటగిరీలో తెలంగాణ రాష్ట్రం అవార్డు దక్కించుకున్నది. ఈ నెల 12న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వర్చువల్ విధానంలో అవార్డును అందజేయనున్నారు. పద్మభూషణ్ గ్రహీత, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసిన వీ రామచంద్రన్ స్మారకార్థం.. జనాగ్రహ సంస్థ రెండేండ్లుగా అవార్డులను అందిస్తున్నది. ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ సివిక్ ఏజెన్సీ, ఉత్తమ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తున్నది.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారంతో భువన ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ (యాప్) విధానంలో పట్టణ ఆస్తులన్నింటిని మ్యాపింగ్ చేశారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను, ప్రకటనల పన్ను, సెల్ టవర్లు తదితర వివరాలను ఇందులో జోడించారు. ఎన్ఆర్ఎస్టీ శాటిటైల్ ఇమేజ్లను పరిశీలించి పన్నులను ఖరారు చేస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటివరకు నాలుగు లక్షల ఆస్తుల శాటిలైట్ చిత్రాలను సేకరించారు. 20.80 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, 6.79 లక్షల నల్లా కనెక్షన్లు, 1.45 లక్షల ట్రేడ్ లైసెన్స్ అసెస్మెంట్స్ను మొబైల్ యాప్ ద్వారా సేకరించారు. వీధి వ్యాపారుల సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. నాలుగు లక్షలకుపైగా వీధి వ్యాపారుల వివరాలను నమోదు చేశారు. దీనివల్ల వీధి వ్యాపారులు రుణాలు పొందడం సులభమైంది. రుణాలు పొందడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. వీటన్నంటిని పరిశీలించిన జనాగ్రహ సంస్థ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేసింది.













