హింసాత్మక ఘటనల వెనక..?
తెలంగాణ ఎన్నికల సమయంలో పలుప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య దాడులు, హింసాత్మక ఘటనల కలకలం రేపుతున్నాయి. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, నిన్న గువ్వల బాలరాజు… ఇలా నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈదాడుల వెనక కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్, కాదు బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తుంటే.. మా కార్యకర్తల్ని రక్షించుకునే క్రమంలో జరుగుతున్నాయని హస్తం పార్టీ నేతలు పరస్పరం ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు గులాబీ పార్టీ నేతలు సానుభూతి రాజకీయాలకు తెరతీశారని.. అందులో భాగంగా దాడులు, ప్రచారమంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అచ్చంపేట ఘటనలో సీఐ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు.
మరోవైపు సాక్షాత్తు మంత్రి కేటీఆర్.. హస్తం పార్టీ నేతలకు వార్నింగిచ్చారు. మీరు ఈ పదిహేను రోజులు మాత్రమే ఇలాంటి పైశాచిక దాడులతో ఆనందం అనుభవించగలరని.. తర్వాత మాప్రభుత్వమే వస్తుంది, మీ సంగతి తేలుస్తామన్నారు. అయితే దాడుల సంస్కృతి కాంగ్రెస్ రక్తంలో లేదని.. త్యాగాలకు తమ పార్టీ పుట్టినిల్లంటున్నారు కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఈదాడులు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో జనంలో సైతం దాడుల అంశం చర్చకు వస్తోంది. ఇక్కడ కూడా కొందరు బీఆర్ఎస్, మరికొందరు కాంగ్రెస్ వైపు వకాల్తా పుచ్చుకుంటున్నారు.
అయితే ఎన్నికలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న రాజకీయ నిపుణులు మాత్రం… ఇది రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ పోటీకి నిదర్శనమంటున్నారు. ఇలాంటి తరుణంలో మాత్రమే అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు.. తెగించి కొట్లాడతారంటున్నారు. ఎక్కడ తమపార్టీ అభ్యర్థి ఓడిపోతాడో అన్న భయం, ప్రత్యర్థులను డబ్బు, బంగారం, వెండి లాంటివి పంచకుండా చూసే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెబుతున్నారు. అయితే ఇవి ఎన్నికల తర్వాత ప్రతీకార దాడులకు దారితీయకుండా తగిన జాగ్రత్తలు అవసరమంటున్నారు.
ఇక ఈసీ కూడా ఇలాంటి అంశాలపై దాడులపై నిశితంగానే దృష్టిపెడుతోంది. ఇప్పటికే పలుచోట్ల అధికారులను మార్చేసింది. ఎన్నికల సందర్భంగా భారీగా కేంద్రబలగాలు మోహరింపు చేస్తోంది. ముఖ్యంగా కేంద్రం లోని బీజేపీ, ప్రధాన విపక్ష పార్టీ, రాష్ట్రంలోని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఇవి ప్రతిష్టాత్మకంగా మారడంతో.. ఈసీకూడా తగిన విధంగా జాగ్రత్తపడుతోంది. మరోవైపు అధికార యంత్రాంగం సైతం… ఇబ్బందులను ఎదుర్కొంటోంది . అన్నిపార్టీల నేతలు తమపై విమర్శలకు దిగుతుండడంతో… ఏం చేసినా విమర్శలు తప్పడం లేదని వాపోతోంది.













