బడ్జెట్ తుది మెరుగుల్లో తలమునకలైన తెలంగాణ సీఎం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ నెల 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌పై తుది కసరత్తు చేస్తున్నారు. సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే పలుమార్లు సీఎం వారితో భేటీ అయ్యి, దిశానిర్దేశం చేశారు. కరోనా తర్వాత రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, బడ్జెట్ రూపకల్పన జరగాలన్న విషయంపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా నుంచి కోలుకుంటున్నప్పటికీ వచ్చే ఏడాది రాబడి కూడా పరిమితంగానే ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఫిట్మెంట్, నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాలతో సహా పలు అంశాలకు భారీగా నిధులు అవసరమున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సీఎం తుది మెరుగులు దిద్దుతున్నారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలపై కేసీఆర్ తుది కసరత్తును చేస్తున్నారు. ఏ శాఖకు ఎంత కేటాయించాలన్న అంశంలో కూడా అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి హరీశ్ రావు కూడా అధికారులతో భేటీ అయ్యారు.













