తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ దేశానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. 8 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలి. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలన్నారు.
కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలన్నారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నాం అని అన్నారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.













