నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ శాసనసభ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయోపరిమితి 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉద్యోగ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠ పింఛను రూ.70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశాం. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు. పీఆర్సీ కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. వయోపరిమితి పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదన్నారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని తెలిపారు.













