ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తెలంగాణ
ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. గత నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్యరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ నగర శివారులోని రావిర్యాలలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌పై కేంద్ర ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అజయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వా నికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.తారక రామారావు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంమీద ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెండింగ్‌లో ఉన్న ఈ క్లస్టర్‌కు అనుమతించాలని గత కొంతకాలంగా మంత్రి కేటీఆర్ కేంద్రంతో సంప్రదింపులు జరుపడంతోపాటు వినతిప్రతాలు ఇస్తూ వచ్చారు. దీంతోపాటు రాష్ట్ర అధికారులను కేంద్ర అధికారులతో సంప్రదింపులు చేసేలా పురమాయించారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, అదేశాలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు చేయడంతో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను మోక్షం కలిగింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో టీఎస్ఐఐసీ అధికారులు ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, నిమ్జ్ సీఈవో మధుసూదన్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ వారికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చారు. ఈ విధంగా కేంద్రం నుంచి నిధులు సాధించడంలో విజయం సాధించారు. ఈ నిధులను రాబోయే మూడేండ్లలో ఖర్చు చేసి ఆయాన కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేయడానికి అనువైన వాతావరణాన్ని దశలవారీగా కల్పించనున్నారు. అంతర్గత , ప్రధాన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ, కామన్ ఫెసిలిటీ సెంటర్, పరిపాలన భవనాలు, ల్యాబ్‌లు, గోడౌన్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. కంపెనీలకు అవసరమయ్యే యూనివర్సల్ మొబైల్ టెస్టింగ్ సర్వీసెస్ ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, ప్రొడక్ట్ డిజైన్ హౌజ్, టూల్ రూం, ప్లాస్టింగ్ మౌల్డింగ్ ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. వీటితోపాటుగా ఉద్యోగులకు హాస్టల్, మెస్ సౌకర్యం, దవాఖాన, క్యాంటిన్, ఉద్యోగుల పిల్లలను చూసుకోవడానికి వీలుగా డేకేర్ సెంటర్ తరహాలో క్రెచ్ ఏర్పాటు చేస్తారు.
క్లస్టర్లో ఏర్పాటయ్యే కంపెనీలు
ఎస్ఎండీ కెపాసిటర్స్, రెసిస్టర్స్, ట్రాన్స్మ్ఫార్మర్స్ తయారు చేసే సంస్థలకు భూములు కేటాయిస్తారు. వీటితోపాటుగా సాకేట్స్ తయారీ, కనెక్టర్స్ ఎక్స్టర్నల్ కేసింగ్, కీ ప్యాడ్స్ మెంబ్రైన్స్, చార్జర్స్ కూడా తయారు చేస్తారు. సిమ్ స్లాట్ కనెక్టర్స్, సెట్ టాప్ బాక్సులు, రిబ్బన్ కేబుల్స్ తయారు చేసే కంపెనీలు సైతం ఏర్పాటవుతాయి.













