అసెంబ్లీ ఎన్నికల ముందు… అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ
అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచే ఉండటంతో వీరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సిట్టింగ్‌లకు బీఆర్ఎస్ టికెట్ వచ్చే అవకాశముందనే సంకేతాలు రావడంతో పార్టీ మారడమే మేలని తీగల భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, పొంగులేటి జూపల్లి లాంటి కీలక నేతలు హస్తం కండువా కప్పుకోవడంతో అదే దారిలో వెళ్లేందుకు తీగల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన తాజాగా మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. త్వరలోనే తన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్మన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.













