పోలో విజేతగా అమెరికా టీమ్

ఇంటర్నేషనల్ అరెనా పోలో ఛాంపియన్‌షిప్ 2024లో యుఎస్‌ఏ (అమెరికా) టీమ్ విజేతగా నిలిచింది. అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ (హెచ్‌పిఆర్‌సి) గ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో నాలుగు దేశాలకు చెందిన జట్లు పోటీ పడ్డాయి. ఫైనల్లో అమెరికా-టీమ్ 15-8 గోల్స్ తేడాతో ఇండియా-2 జట్టును ఓడించింది. తొలి చక్కర్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన పోరులో యూఎస్‌ఏ 3-2 అధిక్యాన్ని అందుకుంది. రెండో చక్కర్‌లో అమెరికా టీమ్ 9-4 ఆధిక్యంలో నిలిచింది. మూడో చక్కర్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో అమెరికా 3-2 ఆధిక్యంలో నిలిచింది. అమెరికా జట్టులో స్లోఆర్ స్టెఫాకిన్స్, జాక్ క్లెంటర్ ఏడేసి గోల్స్ సాధించారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన విశాల్ కున్వర్ సింగ్ టోర్నీలో ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో రాధా టిఎమ్‌టీ గ్రూప్ చైర్మన్ సునీల్ సరాఫ్, యూఎస్‌ఏ కౌన్సులెట్ జనరల్ (హైదరాబాద్) జెన్ని ఫర్ లార్సన్, రాధా గ్రూప్ సీఈఓ స్నేహిల్ సరాఫ్, హెచ్‌పిఆర్‌సి ప్రతినిధులు కున్వర్ సాయి విజేందర్ సింగ్, చైతన్య రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.