ఔషధాల తయారీకి అవసరమైన సహకారం కేటీఆర్
ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాస్యూటికల్ సిటీని ఏర్పాటు చేయబోతున్నామని దేశీయంగా ఔషధాల తయారీనిఅవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హెచ్ఐసీసీలో ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పూర్తి స్థాయిలో మెడిసిన్స్ ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు దిగుమతి అవుతున్నాయన్నారు. 84 శాతం మందుల ముడి సరుకు దిగుమతులపైనే మనం ఆధారపడి ఉన్నామని పేర్కొన్నారు. చైనా నుంచి 66 శాతం ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నాం. మెడిసిన్ దిగుమతులను తగ్గించాలన్నారు. డొమెస్టిక్ మెడిసిన్ తయారు అయినప్పుడే ధరలు తగ్గుతాయన్నారు. దేశీయంగా ఔషధాల తయారీని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.













