ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కి హరీశ్ రావు రాజీనామా
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రాజీనామా చేశారు. లేఖను టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి పంపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో టీఎంయూను నెలకొల్పారు. ఉద్యమంలో కార్మికులను భాగస్వాములను చేసే లక్ష్యంతో హరీశ్ ఆ సంఘం గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఇతరత్రా అధికారిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిచాల్సి వస్తోంది. అందుకే టీఎంయూ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం సాధ్యం కావడం లేదంటూ, పదవి నుంచి వైదొలగాలని ఆయన భావించారు. తాను రాజీనామా చేసినప్పటికీ ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.













