బెంగళూరు వెళ్లాలా? వద్దా?
కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహిత నేతలతో చర్చించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ ముఖ్యమంత్రిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి పార్టీ నేతలతో చర్చించారు. దేవెగౌడ, కుమారస్వామి తనకు సన్నిహితులు. తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. టీఆఎస్ నిర్వహించిన సమావేశాలు, సభలకు హాజరయ్యారు. తాము ప్రతిపాదిస్తున్న జాతీయ సమాఖ్య కూటమినీ స్వాగతించారు. దానికి అనుకూలంగా మాట్లాడారు. బెంగళూరు వెళ్లినప్పుడు స్వాగతం పలికి ఆతిథ్యం కూడా ఇచ్చారు అని ముఖ్యమంత్రి నేతలకు వివరించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారానికి రాహల్‌గాంధీ, సోనియాగాంధీలు హాజరవుతున్నందున్న, వారితో వేదికను పంచుకోవడం వల్ల ఏర్పడే పరిస్థితుల గురించి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నేతలతో చర్చించగా, ఆహ్వానం మేరకు బెంగళూరు వెళ్తేనే బాగుంటుందని నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారానికి గడువు ఉన్నందున రేపు తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.













