మంత్రి కేటీఆర్ పుట్టిన రోజుకు…ఆంధ్రా అమ్మాయి అరుదైన బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దివ్యాంగురాలైన చిత్రకారిణి స్వప్నిక ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన స్వప్నిక విద్యుత్ షాక్‌తో చిన్నతనంలోనే రెండు చేతులు కోల్పోయారు. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నోటీతోనే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. కేటీఆర్ అభిమాని అయిన స్వప్నిక జన్మదిన సందర్భంగా తన అద్భుత కళతో కేటీఆర్ చిత్రపటాన్ని గీశారు. మంత్రి చేసే సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి పంజాబ్‌కు చెందిన దివ్యాంగ చెస్ క్రీడాకారిణి మల్లికా హండాకు తానున్నాంటూ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేయడం తనలో ఎంతగానో స్ఫూర్తి నింపిందని స్వప్నిక తెలిపారు. ఆయన చేసిన పని తనాలాంటి వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, రాజకీయ నేతల చిత్రపటాలతోపాటు సామాజిక అంశాలు, ఆడపిల్లలకు సంబంధించిన అంశాలపై తన నోటితోనే పెన్సిల్ స్కెచ్ వేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.













