లోక్ సభ బరిలో మండలి చైర్మన్ ?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, అవకాశమిస్తే తన సొంత నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి బరిలో దిగుతానని తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. వచ్చే నెలలో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తున్నందున సోమవారం జరిగిన మండలి సమావేశమే ఆయనకు చివరిది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఎన్నికల బరిలో దింపాలా వద్దా అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. తనకు చేవెళ్లతో అనుబంధం ఉందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడాలనే కసి ఉందన్నారు. తనకు ఏ పని అప్పగించినా కసితో చేస్తానని, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తానని, ఒకవేళ సీఎం కేసీఆర్ ఖాళీగా కూర్చోమంటే అలాగే కూర్చుంటానని తెలిపారు. మండలి చైర్మన్గా తనకు ఎంపిక చేసిన సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమం ఒక చప్రాసీని మండలి చైర్మన్గా చేసిందన్నారు. చైర్మన్ పదవీకాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదన్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న అంశంపై స్పందిస్తూ.. పదవుల విషయంలో ఎవరు ఎక్కడ ఉపయోగపడతారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే కేసీఆర్ నియామకాలు ఉంటాయి. నాకు మంత్రి పదవి రాలేదన్న బాధలేదు అని బదులిచ్చారు. నిబంధనల మేరకు పార్టీ ఫిరాయింపుల విషయంలో కఠినంగా వ్యవహరించానన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా తన కంటికి గాయమైన విషయంపై స్పందిస్తూ.. చట్ట సభల్లో వస్తువులు విసరడం సరికాదన్నారు. త్వరలో విపక్ష సభ్యులంతా పదవీ విరమణ చేయడాన్ని ప్రసావిస్తూ.. విపక్షం లేకపోతే అధికార పక్షమే కొన్ని సార్లు ప్రశ్నించి ప్రజలకు సమాధానమిస్తుందాన్నారు.













