తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరల లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఆలోచనతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.
మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం జాతీయ హరిత ట్రైబ్యునల్ విదించిన రూ.500 కోట్ల జరిమానాపై స్టే విధించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, ఆరు వారాల్లో ప్రతివాదులంతా కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.













