బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ప్రస్తుతం ఈ కేసు విచారణలో తాము వేలు పెట్టలేమని, అందువల్ల బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అలాగే బెయిల్ కావాలనుకుంటే ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని ఎమ్మెల్సీ కవితకు సూచించింది.
కాగా.. పిటిషన్‌పై కవిత తరపు న్యాయవాది కబిల్ సిబల్ కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కోర్టుకు వివరించారు. ఈడీ కవితను రెండు సార్లు విచారణకు పిలించిందని, అయితే అందులో ఒకసారి సాక్షిగా విచారించగా.. రెండోసారి అనూహ్యంగా నిందితురాలిగా విచారించారని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈడీ వద్ద కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, కేవలం అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, తన క్లయింట్ కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఆమెకు బెయిల్ ఇచ్చి ఊరట కల్పించాలని కోరారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై కీలక కామెంట్స్ చేసింది. తాము ప్రస్తుతానికి ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించడం లేదని, కేసు విచారణలో వేలు పెట్టదలచుకోలేదని స్పష్టం చేసింది. అలాగే బెయిల్ ఇవ్వలేమని, మొదట కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని తేల్చి చెప్పిన త్రిసభ్య బెంచ్.. పిటిషనర్‌కు కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేసే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించింది. అలాగే కేసు విచారణ త్వరితగతిన చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సూచించింది.
అంతేకాకుండా ఈ పిటిషన్‌లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందువల్ల.. ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు ఈ పిటిషన్‌ను కూడా జతచేస్తున్నట్లు సుప్రీం కోర్టు బెంచ్ వెల్లడించింది. ఇక ఈడీకి కూడా రాజ్యాంగ పరమైన అంశాలపై నోటీసులు జారీ చేసి 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని, ఆ తర్వాత మరో 2 వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది.