పదో తరగతి విద్యార్థి హరీశ్ కు హైకోర్టులో ఊరట
కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్థి హరీశ్ వద్ద నుంచి ప్రశ్న పత్రం బయటకు వచ్చినట్టు తేలడంతో చీఫ్ సూపరింటెండెంట్ అతన్ని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. ఇందులో తాను ఏ తప్పూ చేయలేదని, అయిదేళ్ల పాటు డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి బోరున విలపించారు. కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి హరీశ్ వచ్చాడు. అతన్ని హనుమకొండ డీఈవో పిలిచి నీ క్వచ్చన్ పేపర్ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు అంటూ మందలించారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపారు. హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలిపించాడు.
విద్యాశాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హరీశ్ తండ్రి తెలంగాణ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గోడదూకి పరీక్షా కేంద్రంలోకి వచ్చిన శివ కృష్ణ పరీక్ష రాస్తున్న హరీశ్‌ను బయపెట్టి ప్రశ్న పత్రం తీసుకున్నాడని పిటిషన్లో పేర్కొన్నారు. హరీశ్ పేపర్ తీసుకుని మొబైల్లో ఫొటో తీసుకున్నాడని, ఆ ప్రశ్న పత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని వివరించాడు. తన కుమారుడిని బెదిరిస్తే భయపడి ప్రశ్నపత్రం ఇచ్చాడని, ఎలాంటి తప్పు చేయలేదని పిటిషన్లో వివరించారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించి, తన కుమారుడి భవిష్యత్తును కాపాడాలని కోర్టును అభ్యర్థించారు. పిటిషనర్ వాదానలు విన్న హైకోర్టు హరీశ్ సోమవారం నుంచి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని విద్యాశాఖను ఆదేశించింది.













