ఏప్రిల్ 14న భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు
భద్రాచలం ఆలయంలో ఏప్రిల్ 14వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న ఉగాది వేడుకలు ఉంటాయి. ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికను తయారు చేసినట్లు కార్యనిర్వహణాధికారి (ఈవో) రమేశ్‌బాబు వెల్లడించారు. ఏప్రిల్ 10న అంకురార్పణ, 11న గరుడపట లేఖనం, 12న అగ్నిప్రతిష్ఠ, 13న ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. 14న శ్రీరామనవమిని పురస్కరించుకుని వార్షిక కల్యాణం అనంతరం చంద్రప్రభ వాహనంపై రాములవారు తిరువీధుల్లో ఊరేగుతారు. 15న మహాపట్టాభిషేకం సందర్భంగా స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 16న సదస్యం పేరిట వైదిక పండితులు మహదాశీర్వచనం అందిస్తారు. 20న చక్రతీర్థ క్రతువుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మేరకు వివరాలను తాజాగా అధికారులు ప్రభుత్వానికి పంపించారు.













