భద్రాదిలో రామయ్యకు పట్టాభిషేకం
కల్యాణ రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. సీతాసమేతంగా సింహాసనమధిష్ఠించాడు. పవిత్ర గోదావరి నది తీరం భద్రాచలంలో రామయ్య మహా పట్టాభిషేకం మనోరంజకంగా సాగింది. రాజాధిరాజ లాంఛనాలతో రామయ్య మహాపట్టాభిషేక అద్బుత ఘట్టాన్ని తిలకించి భక్తజనం పులకరించింది. పట్టాభిషేకం కోసం వేద పఠనం, మంగళ వాయ్యిదాలు, భక్తుల కోలాటాల నడుమ సీతారాములను మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. 10:30 గంటలకు పట్టాభిషేక తంతును అర్చకస్వాములు, వేద పండితులు ప్రారంభించారు. రాజలాంఛనాలతో పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టాభిషేక ముగింపుగా సామ్రాట్ కిరీటాన్ని అహోబిల రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో రామయ్యకు ధరింపజేశారు. ముత్యాలహారాన్ని రామయ్య మెడలో అలంకరించారు. అది రామయ్య నుంచి సీతమ్మకు, సీతమ్మ నుంచి హనుమంతుకి సమర్పించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారామచంద్రస్వామికి రాజవస్త్రాలను సమర్పించారు. అహోబిల మఠం నుంచి సైతం స్వామివారి పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని ప్రత్యేక గజమాల, వస్త్రాలను సమర్పించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని గవర్నర్ నరసింహన్ దంపతులు సందర్శించారు.













