అమెరికన్ ఎంబీసీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఇంగ్లీష్ టీచర్లకు బోధనపై మరింత పట్టు పెంచేందుకు అమెరికా రాయబార కార్యాలయం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఢల్లీిలో ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమానికి తెలంగాణ, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి వంద మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఆంగ్ల భాషలో మంచి పట్టున్న ఉపాధ్యాయులను వడపోసి ఎంపిక చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం నుంచి 40 మందికి పైగా ఉపాధ్యాయులు శిక్షణ పొందుతుండగా మిగిలిన రాష్ట్రాల నుంచి 60 మంది ఉన్నట్టు చెబుతున్నారు. ఆంగ్ల భాష అభివృద్ధి, శిక్షణలో పేరెన్నిగన్న ఐఎస్‌వోఎల్ ఇంటర్నేషనల్ సంస్థ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అంతంత మాత్రంగానే ఉంటోందని అటువంటి విద్యార్థులకు ఈ భాషలో రాణించేలా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించి ఇందుకోసం ప్రత్యేక నిధులను కేటాయించింది. విద్యార్థులకు ఆంగ్ల భాషను ఎలా బోధించాలో, శిక్షణ మెళకువలను ఎలా నేర్పించాలో ఈ సందర్భంగా వివరిస్తారు.
పరిశీలన, అధ్యయనం, నూనత నైపుణ్యాలకు సంబంధించి ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు. శిక్షణతో పాటు వారికి స్టడీ మెటీరియల్‌ను కూడా అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆంగ్ల ఉపాధ్యాయులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి మిగిలిన ఉపాధ్యాయులకు తాము పొందిన శిక్షణను వివరించాల్సి ఉంటుంది. వారు ఢల్లీిలో ఎలా శిక్షణ పొందారో అంతే మొత్తంలో తోటీ ఉపాధ్యాయులకు అన్ని అంశాలను చెప్పవలసి ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో ఢల్లీి ప్రభుత్వ సహకారంతో అక్కడ పనిచేస్తున్న 200 మంది ఇంగ్లీష్ టీచర్ ట్రైనర్లకు ఇలాంటి శిక్షణ ఇచ్చారు. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లోని టీచర్లు, ట్రైనర్లకు కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. యూఎస్ ఎంబసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వం భరిస్తుంది.