మునుగోడులో ‘నోట్ల’ పండగ..! కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమైన పార్టీలు!!
మునుగోడు ఉపఎన్నిక మహా యుద్దాన్ని తలపించబోతోంది. మూడు ప్రధాన పార్టీలూ నువ్వేనేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. డబ్బు ఖర్చు చేసేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ పార్టీ కూడా వెనుకంజ వేసే పరిస్థితి లేదు. అభ్యర్థులందరూ ఆర్థికంగా పరిపుష్టి కలిగినవాళ్లే. పార్టీలు కూడా గెలుపుకోసం ఎంతకైనా తెగించే తెంపు ఉన్నవే. దీంతో ఓటర్లు పండగ చేసుకుంటున్నారు. పార్టీలు, నేతల నుంచి అందినకాడికి లాక్కునేందుకు సిద్ధమయ్యారు.
ఒకప్పుడు ఎన్నికలంటే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే అభ్యర్థులు పరిమితమయ్యేవారు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. గెలిచాక ఏం చేస్తావనేదానికంటే గెలిపించేందుకు నాకేమిస్తావ్ అని డిమాండ్ ఓటర్ల నుంచి వస్తోంది. అదే సమయంలో ఓటర్లు అడగకపోయినా ఓటుకు విలువ కట్టేందుకు అభ్యర్థులు సిద్ధమైపోయారు. ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉండడంతో తీసుకునేందుకు ఓటర్లు ఎప్పుడూ ముందుంటారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు.. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకునేందుకు ఓటర్లు సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు మునుగోడులో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే పలు ప్రభుత్వ పథకాలతో ఓటర్లకు గాలమేస్తోంది. ఇక బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈసారి మళ్లీ గెలిచేందుకు అన్నివిధాలా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. టీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
మునుగోడులో నోట్ల వరద పారనుందని తెలుసుకున్న ఓటర్లు.. అక్కడ ఓటుహక్కు పొందేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మునుగోడులో కొత్తగా ఓటు హక్కు పొందేందుకు 23వేల దరఖాస్తులు వచ్చాయంటే అక్కడ ఓటుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగినప్పుడు కేవలం 15వందల కొత్త అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కానీ మునుగోడులో మాత్రం భారీ దరఖాస్తులు అందాయి.
మునుగోడులో నెల రోజుల నుంచే జాతర వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నెల రోజుల నుంచి కొంతమందికి రోజూ మద్యం, ముక్క పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దసరా రోజు ఒక్కో ఓటరుకు కిలో మాంసం, మద్యం పంపిణీ చేసింది. మరో ప్రధాన పార్టీ ఏకంగా ఇంటికో పొట్టేలును ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నిక జరగడానికి ఇంకా నెల రోజుల టైం ఉంది. అయినా ఇప్పటి నుంచి పార్టీలు నోట్లు వెదజల్లుతున్నాయి. పోలింగ్ ముందు వారంలో ఒక్కో ఓటుకు పదివేలు ఇచ్చేందుకు కూడా పార్టీలు వెనకాడబోవని సమాచారం. ఇదే జరిగితే ఎన్నికల నాటికి ఒక్కో పార్టీకి వంద నుంచి 2 వందల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే బహుశా దేశంలోనే ఇంత ఖరీదైన ఎన్నిక మరొకటి ఉండదేమో.!













