కామారెడ్డిలో పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం
కామారెడ్డి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి ఇ. విష్ణువర్ధన్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత షిండే, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలతో కలిసి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ప్రజలు పాస్ పోర్టు తీయాలంటే ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పోచారం చెప్పారు. గతంలో పాస్‌పోర్టు కోసం అర్ధరాత్రుల్లోనూ క్యూలైన్లలో నిలుచుని ప్రజలు అవస్థలు పడేవారని తెలిపారు. ఇప్పుడు పాస్ పోర్టు సేవా కేంద్రాలు విస్తరణకు నోచుకోవడం శుభ పరిణామమన్నారు.
కామారెడ్డి జిల్లా నుంచి వందలాది మంది నిత్యం హైదరాబాద్‌కు పాస్‌పోర్టు కోసం వస్తున్నారని సేవా కేంద్రం ఏర్పాటుతో ఇబ్బందులు తీరుతాయని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్దన్ రెడ్డి చెప్పారు. కామారెడ్డిలో తత్కాల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని రకాల సేవలను ఇక్కడ అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా వెల్లడించారు. ప్రజలెవ్వరూ పాస్ పోర్టు కోసం ఏజెంట్లను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.













