టి. కాంగ్రెస్ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన సోనియాగాంధీ
వరుస ఓటములతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుండటంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించారు. గత కొంత కాలంగా పార్టీ నేతలతో భేటీ కాకుండా ఉన్న సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ ఎంపికతోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపైన ఆమె ఆరాతీసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చినప్పటికి రెండు పర్యాయాలు వరసగా అధికారానికి దూరం కావడానికి గల కారణాలపైన చర్చించినట్లుగా సమాచారం.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని సోనియాకు మాణిక్యం ఠాగూర్ నివేదిక ఇచ్చారనే చర్చ సాగుతోంది. ప్రజాకర్షణ నాయకుడికి పార్టీ పగ్గాలు ఇస్తే 2023లో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ అధ్యక్షుడి విషయంలో రకరకాలు ఊహగాహనాలు వినిపిస్తున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తే నాయకులతో సోనియా సమావేశం కావడంతో టీ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. జనవరి తొలివారంలో టీపిసిసి అధ్యక్షుడిని ప్రకటిస్తారని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తే తప్పా వాయిదా పడేందుకు అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు టీపీసీసీ పదవికోసం చాలామంది సీనియర్లు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒకరికి టీ పీసీసీ ఇవ్వడం వల్ల మిగతవారు నొచ్చుకునే పరిస్థితి ఉందని గ్రహించిన అధిష్టానం వారికి కూడా గౌరవించాలనే ఆలోచనకు వచ్చారు. పదవుల పంపకాల్లో సామాజిక న్యాయంతోపాటు మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతోపాటు ఉన్నతవర్గాలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. టీ పీసీసీ సలహా మండలిని ఏర్పాటు చేసి అందులో సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈ సలహా మండలి కమిటీలో సీనియర్ నాయకులైన జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి తదితర నేతలకు చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
టీ పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి అప్పగిస్తే ఆ పార్టీ పదవి కోసం పోటీపడుతున్న మరో నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రస్తుత టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, దామోదర రాజనరసింహకు ఏఐసీసీలో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయి. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కొండా సురేఖ, సంపత్‌కుమార్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తోపాటు మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ లేదా మరో నేతకు అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించి సీఎల్పీ నాయకుడికి మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు ఇచ్చే అంశంపై పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రచార కమిటీలో భట్టితో పాటు మరికొందరికి సీనియర్లకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. టీ పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్‌రెడ్డికి ఇస్తే టీ పీసీసీ కోశాధికారిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. టీ పీసీసీ మహిళ కాంగ్రెస్ బాధ్యతలు ఎమ్మెల్యే సీతక్కకు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు.
టీ పీసీసీ ఎంపిక విషయంలో అనిశ్చితి నెలకొన డంతో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీనే రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సీనియర్లు, జూనియర్లుగా విడిపోవడంతో మరోసారి టీ పీసీసీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి పార్టీ ముఖ్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు.













