దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతాను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియశీల పాత్ర పోషించారని, ఉద్యమంలో, పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాసవరకు ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలు పంచుకున్నదని, నియోజకవర్గ ప్రజలతో ఆ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు కావడానికి అతని కుటుంబసభ్యులే ప్రాతినిధ్యం వహించడం సమంజసమని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.













