మెట్రో స్మార్ట్ ‘సైకిళ్లు’.. అరగంట ఫ్రీ
మెట్రో స్టేషన్ల దగ్గర సైకిళ్లు రెడీ అయ్యాయి. ఈ సైకిళ్లను అద్దెకు ఇవ్వనున్నారు. సభ్యత్వం తీసుకున్న వారు మొదటి అరగంట ఉచితంగా వాటిని వినియోగించుకునే సౌలభ్యం కల్పించారు. ప్రధానమంత్రి మెట్రోను ప్రారంభించే మియాపూర్ స్టేషన్ దగ్గర తొలి సైకిల్ స్టేషన్ ఇప్పటికే సిద్ధమైంది. జర్మనీ నుంచి దిగుమతి చేస్తున్న అత్యాధునిక 25 సైకిళ్లను(స్మార్ట్‌బైక్) సిద్ధంగా ఉంచారు. మెట్రోతోపాటే..ఈ సేవలనూ ఆ రోజే ప్రారంభిస్తారు.
HBC, హైదరాబాద్ మెట్రోరైలు, UN హ్యాబిటాట్ మధ్య గత ఏడాది కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం నగరంలో నిర్మిస్తున్న 64 మెట్రో స్టేషన్లతోపాటూ..వేర్వేరు ప్రదేశాల్లో 400 చోట్ల 10 వేల సైకిళ్లను ఏర్పాటు చేయాలన్నది ఒప్పందం.
సభ్యత్వం పొందడమిలా…
.. హెచ్‌బీసీలో రూ.500 బయానా చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి.
.. స్మార్ట్‌బైక్ యాప్(మెట్రో ప్రారంభం రోజున దీన్ని విడుదల చేస్తారు) డౌన్లోడ్ చేసుకోవాలి.
.. సైకిల్‌కి ఉన్న ఆన్‌బోర్డ్ కంప్యూటర్లో మీట నొక్కితే అది యాక్టివేట్ అవుతుంది.
.. తర్వాత మొబైల్లోని యాప్‌లో సైకిల్‌పై ఉన్న సంఖ్యను నమోదు చేస్తే..‘క్యూఆర్ కోడ్’ కన్పిస్తుంది.
.. దాన్ని సైకిల్‌పై ప్రదర్శించినా.. లేదా కోడ్‌ను ఆన్‌బోర్డులో నమోదు చేసినా సైకిల్ తాళం తెరుచుకుంటుంది. అప్పట్నుంచి అద్దె సమయం మొదలవుతుంది.
.. సమీపంలోని సైకిల్ స్టేషన్‌లోని వెళ్లాక తాళం వేసి, కంప్యూటర్లో నమోదు చేస్తే సరిపోతుంది.
.. అద్దెలను క్రెడిట్, డెబిట్‌కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
.. యాప్ ద్వారా మాత్రమే కాకుండా..హెచ్‌బీసీ జారీ చేసే కార్డు ద్వారా దీనిపై ప్రయాణం చేయవచ్చు.
.. జీపీఎస్‌తో అనుసంధానమైన కారణంగా ప్రతి సైకిల్ గమనాన్ని దాని సంఖ్య ఆధారంగా కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా బేగంపేటలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేస్తున్నారు.
.. సభ్యత్వం ఉన్నవారికి అరగంట వరకు ఉచితం. గంట వరకు అద్దె రూ.10గా నిర్ణయించారు. ఆపై ప్రతి అర్ధగంటకు రూ.15 చెల్లించాలి. 8 గంటలు దాటితే ప్రతి గంటకు రూ.100 వసూలు చేస్తారు.
.. సైకిళ్లకు పాసులు ఇచ్చే వీలు కల్పించారు. వారానికి అద్దె రూ.199, నెలకు రూ.399, మూడు నెలలకు రూ.599, సంవత్సరానికి రూ.1999గా హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్(హెచ్‌బీసీ)నిర్ణయించింది.
సభ్యత్వం లేనివారికి…
.. సభ్యత్వం లేనివారికి మొదటి అరగంట సైకిల్ అద్దె రూ.10 కాగా..గంట వరకు రూ.25. ఆపై ప్రతి అర్ధ గంటకు రూ.30, 8 గంటలు దాటిన పక్షంలో ప్రతి గంటకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.













