భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం
భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ఎంతో విశేషమైనది కావడంతో భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. దైవకార్యంలో పాల్గొని శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ప్రతి దంపతులూ సీతారాముల్లా జీవించగలిగితే ధార్మికత వెల్లువిరిస్తుందని పండితులు చేసిన ప్రవచనాలు భక్తులను ఆనందడోలికల్లో తేలియాడించాయి. ఆదివారం కల్యాణానికి సంబంధించిన పూజలు మిథిలా మండపంలో వైభోవోపేతంగా సాగాయి. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల అభిజిత్ లగ్నంలో కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. 150 క్వింటాళ్ల బియ్యం 100 కిలోల ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేశారు. భద్రాది తలంబ్రాలను పవిత్ర కార్యాలకు భక్తులు ఉపయోగిస్తుంటారు. నేడు సీతారామ పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో తాళ్లురి రమేష్‌బాబు తెలిపారు.













