శంషాబాద్ కు కొత్త హంగులు…బిజినెస్ డిస్ట్రిక్ట్ గా ఇక శంషాబాద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తరహాలో శంషాబాద్ ప్రాంతాన్ని కూడా బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగురోడ్డును నిర్మించిన హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. శంషాబాద్ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ సమీపంలో సుమారు 300లకు పైగా ఎకరాల్లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, హార్డ్‌వేర్ పార్కు, శ్రీశైలం జాతీయ రహదారిపై ఫార్మాసిటీ, శంషాబాద్-షాబాద్ మార్గంలోని చందనవెళ్లిలో మరో పారిశ్రామిక వాడ, బెంగళూరు జాతీయ రహదారిలోని కొత్తూరు, తిమ్మాపూర్, షాద్‌నగర్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో శంషాబాద్ పరిసర ప్రాంతాలు భవిష్యత్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మారనున్నాయి. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరించడానికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ కీలకంగా మారింది. అదేతరహాలో దక్షిణ భాగంలో ఉన్న శంషాబాద్ ప్రాంతంలో సరికొత్త వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తరించేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయి.
అమెజాన్ డేటా సెంటర్లు…ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాల తయారీ
చందన వెళ్లి పారిశ్రామిక వాడలో సుమారు 500ఎకరాల్లో ఒక డేటా సెంటర్‌ను, ఫార్మాసిటీ సమీపంలో మరో డేటా సెంటర్‌ను అమెజాన్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే రోడ్డు, రైలు, విమానయాన మార్గాలు ఒకే చోట ఉండటంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు సంస్థలు లాజిస్టిక్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డెలివరీ వంటి సంస్థలు సరుకు రవాణాకు సంబంధించి భారీ విస్తీర్ణంలో గోడౌన్లను నిర్మించి లాజిస్టిక్ సేవలను నిర్వహిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈవీ పాలసీ (ఎలక్ట్రిక్ వెహికిల్స్) లో భాగంగా మహేశ్వరం, చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చి పలు కంపెనీలు ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేలా ఒప్పందాలు చేసుకుంది. ఇందుకోసం వందలాది ఎకరాలను సిద్ధం చేసి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకవైపు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి, మరో వైపు శ్రీశైలం హైవే ఉంది. ఈ రెండు జాతీయ రహదారుల వెంబడి పలు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటిలో తుక్కుగూడ, మహేశ్వరం వద్ద హార్డ్‌వేర్ పార్కు, ఈ సిటీ, కందుకూరు సమీపంలో ఫార్మాసిటీ, చందనవెళ్లి, కొత్తూరు, తిమ్మపూర్ వంటి పారిశ్రామిక వాడలు, ఇటీవల హైతాబాద్-చందనవెళ్లి ప్రాంతంలో మరో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ పారిశ్రామిక వాడల్లో పలు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా, మరి కొన్ని కంపెనీల పనులు పురోగతిలో ఉన్నాయి.
జిఎంఆర్ గ్రూపు ‘ఏరో సిటీ’
జీఎంఆర్ గ్రూపు ‘ఏరో సిటీ’ పేరుతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఆధునిక బిజినెస్ డిస్ట్రిక్‌ను ఏర్పాటు చేస్తోంది. 5వేల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న శంషాబాద్ విమానాశ్రయం ప్రాంగణంలోనే 1500ఎకరాల్లో బిజినెస్, రిటైల్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్కులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. స్కూళ్లు, హెల్త్ కేర్ సదుపాయాలు, అద్దెకు తీసుకునేందుకు నివాస సముదాయాలు, వినోదం తదితరాలతో పూర్తి స్థాయి నివాస, వర్కింగ్ అనుభవనాన్ని పొందే విధంగా అభివ•ద్ధి చేస్తున్నారు. ఏరో సిటీ పేరుతో చేపడుతున్న ఈ కేంద్రం భవిష్యత్తులో బిజినెస్ కారిడార్‌గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని జీఎంఆర్ అధికారులు వెల్లడించారు.













