పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షబ్బీర్ అలీ?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా షబ్బీర్ ఆలీ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. 2009 జరిగిన ఎన్నికలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు.
ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గూలాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.













