కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. సత్యనారాయణ(87) కన్నుమూశారు. మంగళవారం ఉదయం 3:45 కి కన్నుమూశారు. కరోనా కారణంగా ఆయన కొన్ని రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు ప్రకటించారు.
ఎం. సత్యనారాయణ అనే కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెస్సార్ అంటేనే అందరూ గుర్తుపడతారు. ఈయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వెదిరే గ్రామం. జనవరి 14, 1934 లో.జన్మించారు. 1980 నుంచి 83 వరకూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1960 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1971 లో “తెలంగాణ ప్రజా సమితి” ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. మొత్తం 14 సంవత్సరాల పాటు ఎంపీ గా పనిచేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2004 వరకూ పీసీసీ అధ్యక్షునిగా. సేవలందించారు. 2004 నుంచి 2007 వరకూ వైఎస్సార్ కేబినెట్ లో మంత్రి గా, ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు. 2006 లో కేసీఆర్ ను సవాల్ చేసి కరీంనగర్ ఉప ఎన్నికకు కారణమయ్యారు. అక్కడి నుండే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. భారీ మెజారిటీతో కేసీఆర్ గెలవడంతో ఎమ్మెస్సార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం..
ఎమ్మెస్సార్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా ప్రత్యేక శైలితో ఉండేవారని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ముక్కుసూటి మనిషని పేరుతెచ్చుకున్నారని సీఎం కొనియాడారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.













