అఖిలప్రియ సోదరుడికి షాక్
బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఆంధప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఇంకా కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని, జగత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ఇప్పటికే అరెస్టయిన 15 మంది బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. మియాపూర్ సమీపంలోని హఫీజ్‌పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో అఖిలప్రియ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అఖిల ప్రియను ఏ1, సుబ్బారెడ్డిని ఏ2, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ను ఏ3 ముద్దాయిలుగా ఉన్నారు.













