శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీ శిల్పా బజార్ నేషనల్ సంక్రాంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 వరకు మాదాపూర్ శిల్పారామం క్యాంపస్లో జరిగే వేడుకలను తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ, హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కమిషనర్ సహకారంతో ఈ వేడుకలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 17 వరకు మాదాపూర్, ఉప్పల్ శిల్పారామాల్లో గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవరుల పోటీలు నిర్వహించనున్నారు. పిల్లల కోసం 14న భోగి పండ్ల ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.













