సెల్ఫోన్లు, నోట్ల శుద్ధికి శానిటైజర్ క్యాబినెట్!
కరోనా బారిన పడకుండా ఉండటానికి మనం చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. సబ్బుతో కడుక్కుంటున్నాం. మరి మాస్కులు, కరెన్సీనోట్లు, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, ఐపాడ్, పెన్నులు, పుస్తకాలు.. వంటి నిత్యం ఉపయోగించే వాటి పరిస్థితి ఏమిటి. వీటిని రసాయనాలతో లేదా సబ్బుతో శానిటైజ్ చేయడం సాధ్యంకాదు. అలాంటి వాటికోసం హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్.. కొత్తగా యూవీసీ శానిటైజర్ క్యాబినెట్ (అరలున్న పెట్టె)ను ఆవిష్కరించింది. ఇందులో రసాయనాలు లేకుండా అతినీలలోహిత కిరణాల ద్వారా శానిటైజేషన్ జరుగుతుంది. ఎన్-95 మాస్కుల పునర్వినియోగానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకర్స్ ఇబ్బంది లేకుండా కరెన్సీనోట్లు, పాస్‌బుక్కులు ఇతర ముఖ్యమైన కాగితాలను సులువుగా శానిటైజ్ చేసుకోవచ్చు. ఇక నిత్యం చేతిలో ఉండే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఇది శానిటైజ్ చేస్తుంది. ఇందులో ప్రసరించే యూవీ కిరణాలు కొవిడ్-19 కారక వైరస్‌లోని ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ జన్యుపదార్థాన్ని, ఇతర హానికర సూక్ష్మజీవులను నాశనంచేస్తాయి.













