సండ్ర టీటీడీ బోర్డు సభ్యత్వం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియామకం రద్దుయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజులలో బాధ్యతలు తీసుకోవలసిన వెంకట వీరయ్య ఇంతవరకు బాధ్యతలు తీసుకోకపోవడంతో పాలకమండలి నుండి ప్రభుత్వం ఆయనను తొలగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలిలో సండ్ర సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.













