వైభవంగా సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతా కుంభ్-2023 ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలోని వాహనాలు నిలిపే స్థలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి, దేవనాధ జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామిలు మొదటి వార్షికోత్సవాలకు ఆగమశాస్త్ర బద్ధంగా అంకుర్పారణ చేశారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున కుటుంబ సమేతంగా తరలివచ్చారు. వారిని ఉద్దేశించి చిన జీయర్ స్వామి ప్రవచించారు. వెయ్యేళ్ల క్రితమే అట్టడుగు వర్గాల వారికి మార్గదర్శనం చేసిన భగవద్రామానుజాచార్యుల ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుడితో అనుబంధం పెంచుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుందన్నారు. ఆద్యాత్మిక గ్రంథాల సారాంశాన్ని భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.













